తొలిరోజు ఆశించిన వసూళ్లను రాబట్టని ‘ఛపాక్’

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన దీపికా పదుకునే తాజా చిత్రం ‘ఛపాక్’ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. తొలిరోజు కేవలం రూ 4.77 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

దీనిపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. హైఎండ్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఈ చిత్రం కొంతమేర రాణించిందని చెప్పారు. వారాంతం నేపథ్యంలో వసూళ్లు కొంతమేర పెరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు మాత్రం వసూళ్లలో విఫలమైందని చెప్పారు. టైర్-2, టైర్-3 సిటీలు, మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు.

ఈ చిత్రంలో దీపికా ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా.. తొలిసారి నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమా ఆశించనమేరకు వసూళ్లను రాబట్టలేకపోవడంతో.. నటిగా, నిర్మాతగా రెండు విధాలుగా దీపికా నష్టపోయినట్టయిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి

Loading...