రజిని ‘దర్బార్’ రివ్యూ

విడుదల తేదీ : జనవరి 09, 2020
నటీనటులు : రజిని కాంత్,సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్ తదితరులు
దర్శకత్వం : ఏ ఆర్ మురుగదాస్
నిర్మాత‌లు : ఏ. శుభాస్కరన్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫర్ : సంతోష్ శివన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

రజినీకాంత్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ కబాలి, కాలా, 2.0, పేట వంటి సినిమాలు చేసినా ఇవన్నీ కూడా యావరేజ్ గా నిలిచినా సినిమాలే కావడం విశేషం. మంచి సాలిడ్ హిట్ కోసం రజినీకాంత్ చాలా ప్రయత్నం చేశారు. గత 15 ఏళ్లుగా మురుగదాస్ తో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్న రజినీకాంత్ కు దర్బార్ సినిమాతో అవకాశం దొరికింది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుండా లేదా చూద్దాం.

కథ:

ముంబైలో పోలీసుల ప్రాబల్యం తగ్గిపోవడంతో డ్రగ్స్, ఆడపిల్లలపై అరాచకాలు పెరిగిపోతుంటాయి. యువత డ్రగ్స్ కు బానిసల్లా మారిపోతుంటారు. ఆ సమయంలో ముంబై పోలీస్ కమిషనర్ గా రజినీకాంత్ వస్తారు. కమిషనర్ గా వచ్చిన వెంటనే వేలమంది ఆడపిల్లలను రక్షిస్తారు. ఎవరి మాట వినని పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంటారు. అరాచకాలు సృష్టించే వ్యక్తులు ఎవరైనా సరే వదిలేది లేదనే సందేశాన్ని ఇస్తారు. ఒకవైపు సిన్సియర్ గా డ్యూటీ చేస్తూనే రజినీకాంత్ తన కూతురు నివేతతో సరదాగా గడుపుతుంటారు. అదే సమయంలో నయనతార పరిచయం అవుతుంది. అదే సమయంలో జరిగిన కొన్ని సంఘటన తరువాత విలన్ సునీల్ శెట్టి… పోలీస్ కమిషనర్ రజినీకాంత్ ను టార్గెట్ చేస్తాడు. ఈ సమయంలోనే రజినీకి తీరని అన్యాయం జరుగుతుంది. తన జీవితంలో విషాదం నింపిన వ్యక్తులపై రజినీకాంత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. కానీ, కథనాలు కొత్తగా ఉండటంతో సినిమాకు ప్లస్ అయ్యింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకల్లో రజినీకాంత్ ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఇలాంటి కథను నమ్మి నిర్మాతలు సినిమా చేయడం గొప్పవిషయం అన్నారు. వాళ్ళు చెప్పడమే కాదు, అసలు రజినీకాంత్ స్టార్ హీరో ఈ కథతో సినిమా అంటే దాన్ని చేయడానికి ముందుకు రావడమే గొప్ప విషయం. మురుగదాస్ మ్యాజిక్ చేశారు అని చెప్పినట్టుగా నిజంగానే సినిమాలో మాయ కనిపిస్తుంది.

చెడు అలవాట్లకు బానిసలౌతున్న యువతను డ్రగ్స్ నుంచి బయటపడేసే విధంగా చేయడంలో రజినీకాంత్ ఎలాంటి వ్యూహం పన్నారు అన్నది సినిమాలో చక్కగా చూపించారు. ముంబై పోలీస్ కమిషనర్ గా వచ్చిన వెంటనే రజినీకాంత్ డిప్యూటీ సీఎం కూతురుని కాపాడటం, ఆమెను కాపాడే సమయంలో వేలాది మంది అమ్మాయిలను రక్షించడంతో ముంబైలో రజినీకాంత్ ఒక్కసారిగా ఫేమ్ అవుతాడు. ఈ క్రమంలో వచ్చిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. అలానే అజయ్ మల్హోత్రాను విదేశాల నుంచి ఇండియాకు తీసుకురావడం, అక్కడి నుంచి జైల్లోనే అతడిని చంపేయడం వంటివి ఇంటిలిజెంట్ గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

ఫస్ట్ హాఫ్ అదిరిపోవడంతో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నారు. సెకండ్ హాఫ్ ఎక్కువగా సెంటిమెంట్ మీదనే దృష్టి పెట్టారు. అలానే విలన్ సునీల్ శెట్టిని బయటకు రప్పించేందుకు వేసే ఎత్తులు కొత్తగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ సాదాసీదాగా ఉండటం విశేషం.

నటీనటుల పనితీరు:

రజినీకాంత్ సినిమాను తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారు. 30 ఏళ్ల క్రితం రజిని ఎంత హుషారుగా ఉండేవారో… అదే హుషారుతో సీన్స్ చేశారు. డ్యాన్స్, ఫైట్స్ చేశారు. రజిని ఆ వయసులో కూడా ఇలా చేస్తుంటే ఫ్యాన్స్ అంతకంటే కావాల్సింది ఏముంటుంది. బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా, ఓ కూతురికి తండ్రిగా, నయనతారకు లవర్ గా అద్భుతంగా నటించారు. ఇక నివేత థామస్ తన నటనతో ఆకట్టుకుంది. అలానే నయనతార పాత్ర చిన్నదే అయినప్పటికీ మెప్పించింది. విలన్ గా చేసిన సునీల్ శెట్టి ఆకట్టుకున్నాడు. యోగిబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కామెడీతో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

మురుగదాస్ ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికి కథనాల్లో మ్యాజిక్ చేశారు. రజిని అభిమానులు ఏం కోరుకుంటారో ఒక సగటు అభిమానిగా అలోచించి సినిమా తీశారు. మురుగదాస్ ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. అనిరుద్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. సంతోష్ శివన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుందని చెప్పొచ్చు.

పాజిటివ్ పాయింట్స్:
రజినీకాంత్ నటన
నివేత థామస్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ

నెగెటివ్ పాయింట్స్:
కథ
సెకండ్ హాఫ్ నెమ్మదించడం

రేటింగ్ : 2.75

Loading...