టీడీపీని రక్షించగలిగే వ్యక్తి తారక్ ఒక్కడే అన్న వర్మ

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి వర్మ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆ సినిమాను ఏపీలో చంద్రబాబు అడ్డుకోవడానికి ప్రయత్నించారంటూ పెద్ద పోరాటమే చేశారు. బాబుపై ట్వీట్టర్‌లో విమర్శల దాడి చేశారు. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. తాజాగా విజయవాడలో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా వర్మ హాజరయ్యారు. అలాంటి వర్మ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ల నుంచి ఏపీ రాజకీయాలపై ట్వీట్స్ చేస్తున్న వర్మ ఈసారి కూడా వాటిపైనే స్పందించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాపాడగలరని అన్నారు.

అప్పుడే ప్రజలు టీడీపీ అపజయాన్ని మరిచిపోతారని ట్వీట్ చేశారు. అంతేకాదు మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే అది తారక్ ఒక్కడేనన్నారు వర్మ. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత ఎన్టీఆర్‌పై ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతల్ని తన భుజాలపై వేసుకోవాలన్నారు వర్మ. ఇప్పటికే ఓటమి చెంది రకరకాలుగా షాక్ లో ఉన్న టీడీపీ అభిమానులు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Loading...