‘రణరంగం’ మూవీ రివ్యూ

నటీనటులు: శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్, మురళీశర్మ తదితరులు
మాటలు: అర్జున్ – కార్తీక్
సంగీతం : ప్రశాంత్ పిళ్ళై
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచనదర్శకత్వం: సుధీర్ వర్మ
సెన్సార్ : U/A
నిడివి : 138 నిమిషాలు
రిలీజ్ డేట్: ఆగస్ట్ 15, 2019

డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ స్టోరీస్ టచ్ చేయడం శర్వానంద్ కు ఇష్టం. అందుకే ఇప్పటివరకు ట్రై చేయని గ్యాంగ్ స్టర్ కథాంశాన్ని సెలక్ట్ చేసుకున్నాడు.

కథ:

తన ఫ్రెండ్స్ తో కలిసి బ్లాక్ టిక్కెట్స్ అమ్ముకుంటూ జీవితం గడుపుతుంటాడు దేవ (శర్వానంద్). ఏ దారిలో నడిచామనేది దేవాకు ముఖ్యం కాదు, డబ్బు సంపాదించామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇందులో బాగంగా 1995లో వచ్చిన మద్యపాన నిషేధాన్ని దేవా క్యాష్ చేసుకుంటాడు. అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తూ క్రమంగా ఎదుగుతాడు. ఆ తర్వాత మద్యపానంపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ లిక్కర్ కింగ్ గా ఎదిగి, క్రమంగా డాన్ అవుతాడు.

భార్యను పోగొట్టుకొని, కూతురు బాగు కోసం విదేశాలకు వెళ్లిపోయిన దేవాను శత్రువులు మాత్రం వెంటాడుతూనే ఉంటారు. ఈ క్రమంలో దేవ ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటిని అతడు ఎలా అధిగమించి, తన స్థానాన్ని కాపాడుకున్నాడనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు:

పాతికేళ్ల కుర్రాడిగా, 45 ఏళ్ల గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ ఎలాంటి బెరుకు లేకుండా నటించేశాడు. తనలో మంచి నటుడు ఉన్నాడనే విషయాన్ని శర్వా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. వయసుమళ్లిన గ్యాంగ్ స్టర్ పాత్ర, ప్రేక్షకులకు ఏమాత్రం కొత్తగా-ఇబ్బందిగా అనిపించలేదంటే అది శర్వా గొప్పదనం.

1995 నాటి అమ్మాయిగా కల్యాణి క్యూట్ గా ఆకట్టుకుంది. ఈ కాలానికి చెందిన అమ్మాయిగా కాజల్ కూడా గ్లామరస్ గా కనిపిస్తుంది. కానీ ఆమెకు రణరంగానికి పెద్దగా సంబంధం ఉన్నట్టు అనిపించదు. చివరికి ఆమెపై తీసిన పాటను కూడా ఎండ్-టైటిల్స్ లో పడేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎమ్మెల్యేగా మురళీ శర్మ, మరో రాజకీయ నాయకుడిగా బ్రహ్మాజీ, ఆధిపత్యం కోసం ప్రయత్నించే పాత్రలో అజయ్ బాగా సూట్ అయ్యారు.

టెక్నీషియన్స్ పనితీరు :

టెక్నికల్ గా ఓ సినిమా ఎలా ఉండాలనే ప్రశ్నకు ఈ సినిమాను ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు. అంత బాగుంది రణరంగం. దివాకర్ సినిమాటోగ్రఫీ టోటల్ మూవీకే హైలెట్. పాటలు, ఫైట్స్, సీన్స్ అనే తేడా లేకుండా తన టాలెంట్ చూపించాడు దివాకర్. ఇతడి విజువల్స్ కు ప్రశాంత్ పిళ్లై అందించిన నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. సినిమాలో చాలా సన్నివేశాల్లో బలం లేనప్పటికీ.. వీళ్లిద్దరి పనితనం వల్లనే పండాయి.

అర్జున్-కార్తీక్ రాసిన మాటలు బాగున్నాయి. “నిన్ను పెంచారు-నేను పెరిగాను”, “పవర్ ఉంటే సరిపోదు, అది ఎప్పుడు ఎవడిపైన వాడాలో తెలియాలి” లాంటి డైలాగ్స్ తో పాటు కేఏ పాల్ మతప్రచారం చేస్తున్న రోజులు, అధికారం కోసం రాజకీయాలు జోరుగా సాగుతున్న టైమ్ అంటూ చెప్పిన ఉపమానాలు చాలా బాగున్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్, నవీన్ నూలి ఎడిటింగ్ ఇలా టెక్నీషియన్స్ అంతా కలిసి ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. వీళ్ల నుంచి బెస్ట్ ఔట్ పుట్ రాబట్టుకున్న సుధీర్ వర్మకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. కానీ రచయితగా అతడికి ఫుల్ మార్కులు పడవు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు భారీస్థాయిలో ఉన్నాయి.

రివ్యూ :

3 గంటల నిడివితో వస్తున్న సినిమాలు కూడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా నడుస్తున్న రోజులివి. అలాంటిది 2 గంటల 18 నిమిషాల క్రిస్ప్ రన్ టైమ్ తో కూడా కూర్చోబెట్టలేకపోయాడు దర్శకుడు సుధీర్ వర్మ. ప్రస్తుతం, గతం అంటూ స్టోరీల్ని మార్చి మార్చి చెప్పడం వల్ల ఈ సమస్య వచ్చిందా? లేక స్టోరీని ఇంకాస్త ఎంగేజింగ్ గా బలంగా చెబితే బాగుండేదా అనే ఆలోచన వచ్చిందంటేనే సినిమా రిజల్ట్ ఏంటనేది అర్థమైపోతుంది.

శర్వానంద్ పవర్ ను ఎలివేట్ చేసేలా, అతడి లుక్ ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే ఎలాంటి జర్క్ లేకుండా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి కూడా వెళ్తుంది. కానీ అక్కడ్నుంచే అసలు సమస్య మొదలైంది. మళ్లీ ప్రస్తుతానికి రావడం, తిరిగి గతంలోకి వెళ్లడంతో ప్రేక్షకుడు చాలా చోట్ల కన్ఫ్యూజ్ అవుతాడు. అయితే స్క్రీన్ ప్లే ఎలా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు మాత్రం కథను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు సుధీర్ వర్మ. మంచి మలుపుతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

సెకెండాఫ్ నుంచి మాత్రం పూర్తిగా కథ పక్కదోవ పడుతుంది. మరీ ముఖ్యంగా ట్విస్టులు ఏంటనే విషయాన్ని ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేస్తాడు. అలా గెస్ చేయడంతో క్లైమాక్స్ ఏంటనే విషయం కాస్త ముందుగానే తెలిసిపోతుంది. స్క్రీన్ ప్లేకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కాజల్ పై తీసిన మంచి కలర్ ఫుల్ సాంగ్ ను కూడా ఎండ్-టైటిల్స్ లో పడేసిన దర్శకుడు.. ఎమోషనల్ కంటెంట్ రాసుకోవడంపై మాత్రం పెద్దగా దృష్టిపెట్టినట్టు కనిపించదు.

నిజానికి సినిమాకు మంచి నేపథ్యం దొరికింది. మద్యపాన నిషేధం ఉన్న రోజుల్లో అక్రమంగా మందు సరఫరా చేసే ఓ వ్యక్తి ఎలా గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడనే పాయింట్ ను సుధీర్ వర్మ బాగా పిక్ చేసుకున్నాడు. కానీ విజువల్ ఎఫెక్ట్స్, ఫ్రేమింగ్స్, కలరింగ్, స్టైలింగ్ పై పెట్టిన దృష్టిని కథలోఎమోషన్స్ పై పెట్టలేదనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా అద్భుతంగా ఉంది. ఆ యాంగిల్ లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. కానీ కంటెంట్ పరంగా ఎమోషనల్ గా ఆకట్టుకోవడంలో వెనకబడింది.

ఉన్నంతలో ఈ సినిమాని శర్వానంద్ తో పాటు టెక్నీషియన్స్ మాత్రమే ముందుకు నడిపించారు. టెక్నికల్ గా ఎవ్వర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్. కలర్ కరెక్షన్, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్.. ఇలా ఏ యాంగిల్ లో సినిమా తక్కువ కాదు. చివరికి ప్రొడక్షన్ విషయంలో కూడా “సితార” నిర్మాతలు తమ చేతికి ఎముక లేదని నిరూపించుకున్నారు. వీళ్లందర్నీ చక్కగా ట్రాక్ పైకి తీసుకొచ్చిన సుధీర్ వర్మ, తను మాత్రం రైట్ ట్రాక్ లోకి రాలేకపోయాడు.

రేటింగ్ – 2.75

Loading...