‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ

విడుదల తేదీ : జనవరి 11, 2020
నటీనటులు : మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందాన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సంగీత తదితరులు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : రత్నవేలు
ఎడిటర్: తమ్మిరాజు

మహేష్ బాబు గతేడాది మహర్షి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు భరత్ అనే నేను సినిమా. ఇలా రెండు వరస హిట్స్ తరువాత మహేష్ బాబు ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారో.. అలాంటి సినిమాను తీసి మహేష్ బాబు అభిమానులకు ప్రజెంట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దామా.

కథ:
ఆర్మీలో మేజర్ గా పనిచేసే మహేష్ బాబు ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో దిట్ట. కాశ్మీర్ లో కొంతమంది ఉగ్రవాదులు స్కూల్ పిల్లలను బంధిస్తారు. వారి చెర నుంచి మహేష్ అతని టీమ్ పిల్లలను రక్షిస్తుంది. ఆ తరువాత ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా, ఆర్మీ నిబంధనలకు లోబడి కాశ్మీర్ నుంచి కర్నూల్ వస్తారు. అలా వచ్చిన మహేష్ బాబు, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ విజయశాంతికి ఎలా సహాయం చేశారు? ఆమె పోరాటానికి ఎలా వెన్నుదన్నుగా నిలిచారు ? ప్రకాష్ రాజు నుంచి ఆమెను ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

మహేష్ బాబు చాలా కాలంగా సామాజిక అంశాలతో కూడిన కథలతోనే సినిమాలు చేస్తున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఈ మూడు కూడా సామాజిక అంశాలతో కూడిన సినిమాలే. అయితే, మహేష్ అభిమానులు పక్కా మాస్ ఎంటర్టైనర్ సినిమా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి సినిమా సరిలేరు నీకెవ్వరుతో తీరిందని చెప్పొచ్చు. సినిమా కథను కాశ్మీర్లో ప్రారంభిచారు. ఆర్మీ మేజర్ గా మహేష్ యాక్షన్ తో అదరగొట్టారు. ఉగ్రవాదుల నుంచి మహేష్ అతని టీమ్ పిల్లలను ఎలా రక్షించారో అద్భుతంగా చూపించారు. యాక్షన్ మోడ్ లో సాగిన కథ ఆ తరువాత ఎంటర్టైనర్ గా మారుతుంది. కాశ్మీర్ నుంచి రైలులో బయలుదేరిన మహేష్ బాబుకు, రష్మిక, రావు రమేష్, అతని ఫ్యామిలీతో ఏర్పడిన అనుబంధం, ఫన్ సినిమాకు ప్లస్ అయ్యింది. ట్రైన్ ఎపిసోడ్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీగా చిత్రీకరించారు. ఫస్ట్ హాఫ్ అనిల్ మార్క్ కామెడీతో సరదాగా సాగిపోయింది. అయితే, సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ గా నడుస్తుంది.

ఓ మర్డర్ కేసులో పోరాటం చేస్తున్న విజయశాంతికి అండగా ఉండేందుకు మహేష్ బాబు కర్నూలు వస్తారు. మహేష్, విజయశాంతి, ప్రకాష్ రాజ్ లు సెకండ్ హాఫ్ లో పోటీపడి నటించారు. ప్రకాష్ రాజ్ విజయశాంతి కుటుంబంపై పగ తీర్చుకోవాలని చూసిన సమయంలో దానికి మహేష్ బాబు అడ్డుకోవడం వంటి సన్నివేశాలు సీరియస్ గా సాగుతుంటాయి. మధ్యలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. మహేష్ బాబుకూడా సెకండ్ హాఫ్ లో పిట్టకథలు చెప్తూ ఆకట్టుకున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ కొద్దగా సాగదీసినట్టుగా ఉంటుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా క్లైమాక్స్ ఉంటుంది.

నటీనటుల పనితీరు:
మహేష్ బాబుకు చాలాకాలం తరువాత పూర్తిస్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్ చేసే అవకాశం దొరికింది. తన మార్క్ యాక్షన్ చూపిస్తూనే తెరపై నవ్వులు పూయించారు. ఆర్మీ మేజర్ గా, సమాజంలో అన్యాయాన్ని ఎదుర్కొనే ఓ యువకుడిగా రెండు వేరియేషన్స్ లో మహేష్ అదరగొట్టాడు. 13 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి సినిమాకు ప్లస్ అయ్యింది. తనలో నటన చాతుర్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. మహేష్ ను ప్రేమించే అమ్మాయిగా, తనదైన మ్యానరిజంతో ఆకట్టుకుంది రష్మిక. ప్రకాష్ రాజ్ విలన్ గా మెప్పిస్తూనే ఉంటారు. ఈ సినిమాలోనూ అదే విధంగా ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఎంటర్టైనర్, మాస్ సినిమాలు తీయడంలో అనిల్ సిద్ధహస్తుడు అని మరోసారి నిరూపించుకున్నారు. మహేష్ అభిమానులకు ఏం కావాలో వాటిని ఈ సినిమాలో చూపించి మెప్పించారు. దేవిశ్రీ పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. రత్నవేలు కెమెరా పనితనం సూపర్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్:
మహేష్ బాబు, విజయశాంతి, ప్రకాష్ రాజ్, యాక్షన్, కామెడీ
నెగెటివ్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ నిడివి, క్లైమాక్స్

మహేష్ బాబులోని డిఫెరెంట్ యాంగిల్స్ ను ఈ సినిమా ద్వారా చూపించారు. మహేష్ బాబు నుంచి ఎలాంటి నటన కావాలని అభిమానులు కోరుకున్నారు వాటిని ఇచ్చేశారు. ఈ సంక్రాంతికి అభిమానులకు మహేష్ బాబు ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పొచ్చు.

రేటింగ్ : 3.25

Loading...