ప్ర‌ముఖ న‌టుడు రాళ్ల‌పల్లి క‌న్నుమూత‌

రాళ్ల‌ప‌ల్లి… తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు చిర‌ప‌రిచిత‌మైన పేరిది.. సినిమాల్లో ఆయ‌న పండించే హాస్యానికి ప్ర‌త్యేక శైలి ఉంటుంది. అలా ఆయ‌న ఎన్నో తెలుగు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. కానీ ఇప్పుడాయ‌న మ‌న‌మ‌ధ్య లేరు. తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ను 5 ద‌శాబ్దాల నుంచి త‌న హాస్యం, న‌ట‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్న రాళ్ల‌ప‌ల్లి ఇవాళ తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ క‌న్నుమూశారు.

హైద‌రాబాద్‌లోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిట‌ల్‌లో రాళ్ల‌ప‌ల్లి గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ కావ‌డంతో ఆయ‌న ఇవాళ సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో మృతిచెందార‌ని వైద్యులు తెలిపారు. ఈ క్ర‌మంలో రాళ్ల‌ప‌ల్లి భౌతిక కాయాన్ని ఆయ‌న నివాసానికి త‌ర‌లిస్తామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా రాళ్ల‌ప‌ల్లి మృతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ విషాదంలో మునిగిపోయింది.

రాళ్ల‌పల్లి పూర్తి పేరు రాళ్ల‌ప‌ల్లి వెంకట న‌ర‌సింహారావు. ఆయ‌న ఇప్ప‌టికి 850 కి పైగా చిత్రాల్లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న న‌ట‌న‌కు గాను ఎన్నో అవార్డులు, రివార్డుల‌ను కూడా అందుకున్నారు. రాష్ట్ర నంది పుర‌స్కారం ఆయ‌న్ను మూడు సార్లు వ‌రించింది. అలాగే 1976లో ఊరుమ్మ‌డి బ‌తుకులు చిత్రంలో అద్భుత‌మైన న‌టన‌కు గాను ఆయ‌న‌కు ఉత్త‌మ కామెడీ న‌టుడిగా జాతీయ అవార్డు కూడా ల‌భించింది. గ‌ణ‌ప‌తి అనే టీవీ సీరియ‌ల్‌లోనూ ఆయ‌న ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా నంది అవార్డును అందుకున్నారు. కాగా రాళ్ల‌ప‌ల్లి మృతితో సినీ ప్ర‌పంచంలో ఒక గొప్ప హాస్య న‌టుడిని కోల్పోయామ‌ని ప‌లువురు అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు..!

Loading...